Tuesday 30 October 2012

ముక్త్యాల శ్రీ భవానీ ముక్తేశ్వరస్వామి


                     
                      Muktyala  Sri Bhavani Mukteswara Swamy.

                             ముక్త్యాల    శ్రీ భవానీ ముక్తేశ్వరస్వామి.
      मुक्त्याल   श्री भवानी मक्तेश्वरस्वामि आलयम्.    

   కృష్ణానది ఉత్తరవాహినిగా ప్రవహించే పవిత్ర పుణ్యతీర్ధం ముక్త్యాల.కృష్ణాజిల్లా జగ్గయ్యపేటనుండి    దక్షిణం గా కృష్ణాతీరాన     వెలసిన  అతి ప్రాచీన పుణ్య తీర్ధ మిది. క్రీ.శ 12 వశతాబ్దపు నాటి శాసనాలు  శ్రీ భవానీముక్తేశ్వరస్వామి దేవాలయ ధ్వజస్ధంభం ప్రక్కన, కళ్యాణ  మండపం స్థంభం మీద కన్పిస్తున్నాయి. రెండువేల నాటి శాలివాహన సప్తశతి లో ఈ ముక్త్యాల ప్రాంతాన్ని గూర్చిన గాథలున్నట్లు విమర్శకులు భావించారు.

                 కృష్ణానది ముక్త్యాల వద్ద ఉత్తరవాహిని గా మారుతుంది.ఉత్తరవాహినిలో స్నానం      చేయడం సకల కల్మష హర మని భక్తులు భావిస్తారు. కృష్ణానది ఉత్తరవాహిని యైన ఈ ప్రదేశంలోనే నదీగర్భంలో ఒక శివాలయము ఉంది. చిత్రంలో మనకు  ముఖమండపము పై కప్పు, నందీశ్వరుని మూపురంమాత్రమే మనకు కన్పిస్తున్నాయి. ఇది నడి వేసవి లోని స్ధితి. ఇంక వరదలు సంభవించే వర్షాకాలంలో ఆలయమే కన్పించదు.

            
                
                                             నది లోని శివాలయం ,


                          సంవత్సరం లో అధికకాలం నీటిలోనే మునిగి ఉండే ఈ మహాదేవునకు ఆరునెలలు దేవతాపూజ, ఆరునెలలు మానవపూజ అని ప్రాంతీయులు ఛెప్పుకుంటారు. ఈ ముక్తేశ్వరునికి ఎదురుగా నందీశ్వరుడు కూడ తన స్వామితో పాటు నీటిలో మోర ఎగపట్టి కన్పిస్తాడు. ఒక నంది విగ్రహం శిధిలం కాగా వేరొకనంది ని ప్రతిష్టించారు.అందుకే చిత్రంలో మనకు రెండు నందులు కన్పిస్తున్నాయి. వర్ష సాంద్రత తగ్గి ,బరాజు నిర్మాణం జరిగిన ఈరోజుల్లోనే ఈవిధంగా ముక్తేశ్వరుడు నీటిలో ఉంటే , ఆనాడు నదీగర్భంలోనే మూడువందల అరవై రోజులు ఉండేవాడేమో ననిపిస్తోంది. శ్రీ ముక్తేశ్వరుడు ఎల్లవేళలా ఙలధరేశ్వరుడి గానే దర్శనమిచ్చే వాడన్నమాట.



                                                        నీటిలో జంట నందులు.

                                            స్ధలపురాణం.:------           ఈ ముక్తేశ్వరస్వామి బలిచక్రవర్తి ప్రతిష్టగా స్ధలపురాణం చెపుతోంది. పూర్వం నైమిశారణ్యంలో బాణాసురుని తండ్రియైన బలిచక్రవర్తి కైలాసవాసుడైన చంద్రశేఖరునిగూర్చి తపస్సు చేసాడు. అతని తపోజ్వాలలుల ఎల్లలోకాలను దహించివేయసాగాయి. దేవతలందరు భయపడి,పరమేశ్వరుని చేరుకొని రక్షించమని ప్రార్ధించారు. కరుణాహృదయుడైన పశుపతి దేవతల కభయమిచ్చి, తన భక్తుని భక్తికి మెచ్చి బలిచక్రవర్తికి ప్రత్యక్షమయ్యాడు. బలిచక్రవర్తి ప్రత్యక్షమైన పరమేశ్వరుని పలురీతులుగా స్తుతించి ,దేవా! నీవు కాశీక్షేత్రం లో విశ్వేశ్వరుడను పేరుతో వెలసి సమస్త జీవజాలాన్ని కాపాడుతూ ముక్తిని ప్రసాదిస్తున్నావు. అదేవిధంగా దక్షిణకాశి గా పేరొందిన ముక్త్యాల క్షేత్రంలో ముక్తేశ్వరుడ ను పేరుతో శక్తితో గూడి భక్తులకు  ముక్తిని ప్రసాదించమని ప్రార్ధించగా పరమేశ్వరుడు అందుల కంగీకరించి ముక్తేశ్వరుడుగా ముక్త్యాలలో వెలిశాడు. నదీ గర్భంలో స్వర్ణాలయం ఉందని, దానిని విశ్వకర్మ సృష్ఠించాడని బలిచక్రవర్తి ఈ ఆలయంలో స్పటికలింగాన్ని ప్రతిష్టించి పూజించాడని స్ధలపురాణం.

                                                చాగి పోతరాజు శాసనం   
                               చారిత్రక నేపథ్యం : -----             నదీగర్భంలోని ఈ ఆలయం కాక  నదీతీరంలో  మరొక భవానీ ముక్తేశ్వరస్వామి ఆలయం కన్పిస్తుంది.ఇది మహామండలేశ్వరులు,నరసింహవర్ధన  బిరుదాంకితుడైన చాగి పోతరాజు నిర్మాణం.తన విజయ  రాజ్యము యొక్క  ఆచంద్రతారార్క అభివృద్ధి కొరకు, తన  ప్రజల సుఖశాంతుల కోసం చాగి పోతరాజు వేయించిన దానశాసనం శ్రీ భవానీ ముక్తేశ్వరస్వామి ఆలయంలో ధ్వజస్ధంభానికి వెనుక గా నున్న నాగశిలపై కన్పిస్తుంది. ఈ శాసనంలో నరసింహవర్ధన పోతరాజు చేసిన అనేక పుణ్యకార్యాలు ప్రస్తావించబడ్డాయి.
               చాగిపోతరాజు ముక్తేశ్వర మహాదేవరకు ఆలయ నిర్మాణాన్నిచేయించాడు. త్రిపురాంతక కాశ్మీర మల్లేశ్వర  విశ్వనాథ చోడనారాయణ దేవరలకు కనకకలశాలను ఎత్తించాడు. సింహాచల నారసింహునకు       ” చాగి సముద్రము అనే చెఱువు ను తవ్వించాడు. శ్రీశైలం లో మల్లిఖార్జునునకు ఎదురుగా నందికేశ్వరుని ప్రతిష్టించి, దేవ భోగములకొరకు, కంభంపాడు, ముచ్చింతాల,బోదపాడు మొదలగు గ్రామాలను దానం చేశాడు.  నతవాడి సీమను బెజవాడనుండి పరిపాలించిన రాజనీతిజ్ఞుడీయన.  ఈ శాసనం మీద సంవత్సరం  ఛిద్రమైంది . కొంత భాగం లభించక  శాసనం అసంపూర్తిగా ఉంది.  { ఆర్కే/301/1924}
                       బలిచక్రవర్తిచే నిర్మింపజేయబడి,  విశ్వకర్మసృష్టిగా చెప్పబడుతున్న దేవాలయం నదీగర్భంలో అధికకాలం ఉండిపోయి, సామాన్యప్రజలకు  ఉత్తరవాహినిలో శివపూజకు అవకాశం లభించడంలేదనే ప్రజల అభ్యర్ధన మేరకు రెండవపోతరాజు ఈ ఆలయాన్ని నిర్మించి ఉండవచ్చు. ఈతని కాలం  క్రీ.శ 1230 ప్రాంతం . కుఱుకుర్రు స్వయంభూదేవరకు దానం చేసిన నవాబు పేట శాసనం లో వీని ప్రస్తావన కనబడుతోంది. ఆ శాసనకాలం శా.శ. 1152 గా వ్రాయబడింది. నరసింహవర్ధనపోతరాజు బెజవాడ రాజధాని గా నతవాడి సీమను పరిపాలించాడు.ముక్త్యాల దేవాలయంలోని శాసనం వంటిదే విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి వారి ఆలయంలో కూడ కన్పిస్తోంది.  ముక్త్యాలలోని ముక్తేశ్వర ఆలయంలోని కళ్యాణమండపంలో శా.శ.1129  {క్రీ.శ. 1207 } నాటి  ,ఈవని కండ్రవాట్యధిపతి కేశవోర్వీపతి వేయించిన శాసనం ఒకటి కన్పిస్తోంది. కేశవోర్వీపతి ముక్తేశ్వర దేవరకు 25 ఆవులనువిమలాఖండ ప్రదీపశ్రీ “{ అఖండ దీపారాధన} నిమిత్తం దానం చేసినట్లు వ్రాయబడింది . { ఆర్కె/302/1924  }           
                    చాగి వంశములోని రెండవపోతరాజు భార్య ముక్తాంబ యని , ఆమె పేరు మీద ముక్త్యాల నిర్మాణం జరిగి ఉండవచ్చని, ముక్తేశ్వర దేవరకు ఈ ముక్తాంబకు ఏమైనా సంబంధముందేమో యోచించాలని సందేహించారు కొందరు విమర్శకులు. { భారతి.-ఫిభ్రవరి—1933- 273 పే.}  
                       త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతమ్మతో కలిసి వచ్చినప్పుడు స్వర్ణాలయంలోని ముక్తేశ్వరుని సేవించాడని,ద్వాపరయుగంలో ధర్మరాజు సోదరసమేతుడై ఈ మహాదేవరను పూజించినట్లు, కలియుగంలో విక్రమార్కాది మహారాజులందరో ఈ దేవుని దర్శించి తరించినట్లు తాతంభట్టు గురుమూర్తి శాస్ర్తిగారు కృష్ణా మహాత్మ్యము అనే గ్రంధములో వ్రాశారు.ముక్త్యాల లోని మరియొక ఆలయం చెన్నకేశవాలయం.


    ప్రాచీనచరిత్ర  :--------             చరిత్ర లోకి తొంగిచూస్తే----- ముక్త్యాల అతి ప్రాచీన  చరిత్ర గల్గి నట్లుగా కన్పిస్తోంది. రెండువేల సంవత్సరాలనాటి శాలివాహన సప్తశతి లో ఈ ముక్త్యాల ప్రాంతాన్ని గూర్చిన గాథలున్నట్లు విమర్శకులు భావించారు.{ బుద్ధజయంతి మహోత్సవ సంచిక. 13వ పేజి  .} బేతవోలు నుండి జగ్గయ్యపేట  ముక్త్యాల చేరేటప్పుడు  ఎడమవైపు కొండమీద బౌద్ధస్ధూపం కన్పిస్తుంది. అక్కడనుండి ముక్త్యాలకు చేరేవరకు రోడ్డు కిరువైపులా దట్టంగా మోదుగు చెట్లు వ్యాపించి ఉండేవి. ధీని ఆథారంగా   ” సూరన్న అనే కవి ఒక గాథను సంథానించాడు. భౌద్దస్థూపానికి సాష్టాంగ నమస్కారం చేస్తున్న బౌద్ధసన్యాసులను, రోడ్డు కిరువైపుల రాలిన మోదుగు పూవులను కవి ఇందు లో ప్రస్తావించి కథ ను రచించాడు.

                         కీరముహ సచ్చ హే హింరే హయి
                         ననుహపలాస కుసుమేహిం
                          బుద్ధ స్సచలన వందన
                          పడియే హివ భిక్షు సంఘే హిం.
                    జీబుగా నేలపైరాలె జిల్కముక్కు
                     లట్లు పూవులు మోదుగు చెట్ల క్రింద
                     బుద్ధ పాదాంబుజములకుపుడమి వ్రాలి
                    వందవము చేయు భిక్షుక వర్గ మనగ         
                                                                                  {  బుద్ధజయంతి మహోత్సవసంచిక. 15పే}
         ఈ ప్రాంతానికి  దగ్గరలోనే భోగాలపాడు అనే ఒక ప్రాచీన గ్రామముంది.  ప్రాచీన శిథిలాలకు నెలవైన ఈ ప్రదేశం పరిశోధకులను ఆకర్షించింది.కవి పండిత విమర్శకులైన శ్రీ వేటూరి ప్రబాకర శాస్ర్తి గారు ఈప్రాంతంలో పర్యటించి పరిశోధనలు నిర్వహించి కొంత సమాచారాన్ని సేకరించారు. ఆయన యనంతరం 1953మార్చి 9నుండి 15 వరకు వేటూరి శంకరశాస్ర్తి గారి ఆధ్వర్యలో కొన్ని త్రవ్వకాలు జరిగాయి.

                       ఈ తవ్వకాలలో  అనేకమైన కుండలు, శాసనపురాళ్లు,ఎముకలు పూసలు, ఆభరణాలు గాజులు, ఇటుకలు లభించాయి.వీటి మీద లిపి ని బట్టి ఇవి ఇక్ష్వాకుల నాటివిగా గుర్తించబడ్డాయి. శిథిలావశేషాలను, నిర్మాణ విధానాన్ని విశ్లేషించగా, ఇక్ష్వాకులనాటి బౌద్ధభిక్షువులు  ఈ ప్రాంతంలో విహారాన్ని నిర్మించుకొని, బౌద్ధధర్మప్రచారకులుగా ఉండినట్లు భావించబడింది. { బుద్ధ.జ.సం.19పేజి}

               ఈ విధమైన ప్రాచీనచరిత్ర గల్గిన ఈనేల పైన రెండవ పోతరాజు నదీతీరంలో ముక్తేశ్వరుని ప్రతిష్ఠించి, చరిత్రలో నిలిచిపోయాడు.   అనంతర కాలంలోవాసిరెడ్డి వారి వంగడంలో ముక్త్యాల సంస్ధానం రూపుదిద్దుకుంది. మహాకవులు శ్రీ చెళ్లపిళ్ల, విశ్వనాథ వంటివారు దర్శించిన సంస్ధానమిది. ముక్త్యాల రాజా పేరెన్నిక గన్న రాజకీయవేత్త.   అది ఆధునిక చరిత్ర.  ఇచ్చటి ముక్త్యాల కోట చాల ప్రసిద్ధమైంది.  

ప్రత్యేకఉత్సవాలు..... ఈ భవానీ ముక్తేశ్వరస్వామి కి మాఘ బహుళ చతుర్ధశి  మహాశివరాత్రి నాడు కళ్యాణోత్సవం జరుగుతుంది. కార్తీకమాసంలో విశేషపూజ లుంటాయి. పర్వదినాల్లోను, పుష్కర సమయాల్లోను ఇచ్చట కృష్ణవేణి ఉత్తరవాహిని లో స్నానం చేసి తరించడానికి దూరప్రాంతీయులు కూడ తరలివస్తారు. 

 రవాణా సౌకర్యాలు..  జగ్గయ్యపేట నుండి ఆర్టీసి బస్సులు నడుస్తుంటాయి . ఆటోలు కూడ బాగానే తిరుగుతుంటాయి. తేనీరు , ఫలహారాల వరకు హోటళ్లు ఉంటాయి .  
                                                                                                      
**********వందే శంభు ముమాపతిం సురగురం వందే జగత్కారణం  *******************************
                                                           
            

Thursday 25 October 2012

తిరుమలగిరి స్వయంభూశ్రీ వేంకటేశ్వరస్వామి


              Tirumalagiri Swayambhu Sri Venkateswara Swamy.


                                      తిరుమలగిరి  స్వయంభూ శ్రీ వేంకటేశ్వరస్వామి
                          
            
           तिरुमलगिरि स्वयंभू श्री वेंकटेश्वरस्वामि.



                                      తిరుమలగిరి  కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరుడు వెలసిన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఆపదమొక్కులవాడు ,ఆర్తత్రాణ పరాయణుడు నైన ఆ ఏడు కొండల వాడు భక్త పరాధీనుడు కావున తన భక్తులను ఆదుకోవడానికి భక్తులు ఎక్కడికి ఏ రూపం లో రమ్మని అడిగితే అక్కడ ఆ రూపంలో వెలిసే భక్తానుకంపుడు ఆ శ్రీనివాసుడు. వివిధ రూపాలలో తన అర్చారూపాన్ని  భక్తులకు ప్రదర్శించి వారిని అనుగ్రహించడమే కాక  వివిద రీతులలో తన అర్చా రూపాన్ని తానే దర్శించుకొని మురిసి పోవడం ఆ లీలారూపునకు ఒక క్రీడ. లేకపోతే ఇన్ని అవతారాలు, ఇంతమంది అర్చామూర్తులు  ఎందుకుంటారు.  తనను తానే సృజించుకునే అజుడు. అవ్యయుడు. అప్రమేయుడు  ఆది మథ్యాంత రహితుడు  ఆ నారాయణుడు. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నలోకంబగు  పెంజీకటి కవ్వల వెలిగెడి కాంతిధార ఆయన.

                                             
                                               వల్మీకం.    ముందు స్వామి వారి ఊహాచిత్రం 

               అటువంటి కరుణాధాముడు,కారుణ్య రస సింధువు నైన శ్రీమన్నారాయణుడు కలౌ వేంకటనాయక:” అని కలియుగంలో వేంకటేశ్వరుడై భక్తులను కాపాడుచున్నాడు. అటువంటి వేంకటేశ్వరుడు  భరద్వాజముని తప ఫలితంగా  ఈ  తిరుమలగిరి పై వల్మీకాంతర్గతుడై  మహిమానురూప దివ్యదర్శనంతో  శ్రీనివాసుడై స్వయంవ్యక్తుడైనాడు.

                                         

                                                ఆలయానికి మెట్ల మార్గం             

   స్థలపురాణం  :-----         తిరుమలగిరి కృష్ణాజిల్లా  జగ్గయ్యపేట మండలంలో చిల్లకల్లునుండి 3.కిమీ దూరంలో ఉంది.  కృష్ణానది  ఉత్తరవాహిని గా ప్రవహించే పవిత్ర ప్రదేశంలో  ఆశ్రమాన్నినిర్మించుకొని, దీర్ఘకాలం  తపస్సు చేసిన   భరద్వాజమహర్షి  ప్రార్ధన ను మన్నించి  తిరుమలగిరి పై  వల్మీక రూపంలో వేంకటేశ్వరుడుగా అవతరించాడు.  ఆయన పానుపైన ఆదిశేషువు కూడ ఆయనను అనుసరించాడు. తిరుమలగిరి వేంకటేశ్వరుడు  వల్మీకంలో నుండే పూజలందుకుంటున్నాడు. అందుకనే సూర్యాస్తమయం తర్వాత  దేవాలయాన్ని మూసేస్తే మరల సూర్యోదయం తర్వాతే తెరుస్తారు. అంతేకాదు. ఆలయం మూసేసిన తరువాత ఆలయ పరిసరాల్లోగాని , కొండమీద గాని  అర్చక,పాచక,పరిచారకులతో సహా ఎవ్వరూ ఉండరు. రాత్రిపూట స్వామిని సేవించడానికి   ఆదిశేషువు ఇతర నాగులు వస్తారని , వారి రాకను తెలియజేస్తూ , ఆలయము, దాని పరిసరాలు రాత్రివేళల్లో  అద్భుత సువాసనలు వెదజల్లుతుంటాయని ఒక జనశృతి ప్రబలంగా ఉంది. రాత్రి వేళల్లో పెద్ద పెద్ద నాగులు  స్వామి సన్నిథిలో తిరుగాడటం చూసిన సిబ్బంది ఉన్నారు . ఈ కారణంగానే   సాయంత్రం 6 గం.లకు కవాటబంధనం చేస్తే  మరుసటి రోజు   ఉదయం 6గం.కు తిరిగి తలుపులు  తెరవడం  సంప్రదాయంగా వస్తోంది. స్వామి వారు  తిరుమలగిరి పై వెలిసేటప్పుడు తన వామపాదాన్ని  బండశిలలపై తాకించగానే  గంగ పొంగి అక్కడ పుష్కరిణి ఏర్పడింది . దానినే శ్రీపాద పుష్కరిణిగా పిలుస్తున్నారు.   స్వామి ఆలయం ప్రక్కనే కుడివైపు వరాహమూర్తి కొలువుతీరి ఉన్నాడు.  స్వామి వారి ఆలయప్రదక్షిణ సమయంలో  భక్తులు వరాహమూర్తిని   దర్శించి ,స్పృశించి, నమస్కరించి పరవశులౌతుంటారు.
                

                                   
                                             ఆలయ ప్రాంగణం


         భ్రమరాంబా సమేత మల్లేశ్వర  స్వామి ఇక్కడ క్షేత్ర పాలకుడుగా పూజలందుకుంటున్నాడు. తిరుమలగిరి చుట్టూ తొమ్మిది ఆంజనేయమూర్తులను నవాంజనేయ ప్రతిష్ఠ గా భరద్వాజమహర్షి ప్రతిష్ఠించినట్లు ఒక ఐతిహ్యం ప్రచారంలో ఉంది. కాని ప్రస్తుతం ఐదు రూపాలే దర్శనమిస్తున్నాయని స్థలపురాణం చెపుతోంది.

                                                   శ్రీ వరాహస్వామి 

             క్షేత్ర ప్రాథాన్యత :-------   గిరి ప్రదక్షిణం ఇచ్చట ప్రత్యేక ప్రాథాన్యాన్ని పొందింది. ప్రతి ఉగాదికి చుట్టుప్రక్కల జిల్లాలనుండి కూడ వేలాదిమంది  భక్తులు ఎడ్లబండ్లకు ప్రభలు కట్టుకొని  మేళ తాళాలతో వచ్చి స్వామిని దర్శించుకుంటారు.దర్శనానికి వచ్చిన భక్తులందరూ పాలు, పెరుగు, నెయ్యి , కొత్తధాన్యం, కొత్త పెసరపప్పు, గుమ్మడి కాయలు  తీసుకు వచ్చి స్వామికి సమర్పించుకుంటారు. రైతులు తమ పాడి గేదెలను ఆవులను, కోడెదూడలను సర్వాంగసుందరంగా  అలంకరించి  ప్రతి ఉగాదికి కొండచుట్టు ప్రదక్షిణం చేయించడం  ఆనవాయితీ. ఈ  ప్రదక్షిణం తో పశువులకు ఆయురారోగ్యాలు కలిగి పశుసంపద అబివృద్ధి చెందుతుందని రైతులనమ్మకం.    ఆవులను  గిరి ప్రదక్షిణం చేయిస్తే కోడెదూడలు  పుడతాయనే నమ్మకం  ఈప్రాంతపు రైతుల్లో బలంగా ఉంది.
            


                                     
                                                     శ్రీపాద పుష్కరిణి

                    ఈ క్షేత్రానికి  క్షేత్రపాలకుడుగా నున్న శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వరస్వామి వారి ఆలయానికి ఉత్తరభాగంలో ఒకబిల్వవృక్షం ఉంది. దీనిని సంతాన బిల్వవృక్షమని పిలుస్తుంటారు. సంతానార్ధులైన దంపతులు యీబిల్వవృక్షం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి , భార్య తన చీర చెంగు చింపి ఈ చెట్టుకు కట్టి తన కోరిక తెలుపుకుంటే ఏడాది తిరిగే సరికి పండంటి బిడ్డతో వచ్చి స్వామిని దర్శించుకుంటారని భక్తుల ప్రగాఢవిశ్వాసం.

                 శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వరస్వామి ఆలయం.   వెనుకగా సంతాన బిల్వవృక్షం

                  అలాగే స్వంత యిల్లులేని  గృహస్థులు స్వామి పట్ల విశ్వాసంతో   మల్లేశ్వరస్వామికి దక్షిణభాగంలో ఉన్న రాళ్లల్లో రాయిపైన రాయి ఐదు రాళ్లను ఎత్తుగా పేర్చి  దంపతులు తనకోరికను స్వామితో చెప్పుకుంటే ఇల్లు సమకూరుతుందని  భక్తులు నమ్ముతున్నారు. ప్రతి ఉగాది ఎడ్లబండ్లు కట్టుకొని   చుట్టుప్రక్కలనుండే కాక ఇతరజిల్లాల నుండి వచ్చేవారిలో కూడ  దంపతులు,నవదంపతులే ఎక్కువగా ఉండటం మనం గమనించవచ్చు. కలియుగ నాథుడైన శ్రీవేంకటేశ్వరుని  శనివారం నాడు దర్శించడం,అభిషేకం చేయించుకోవడం,  అష్టోత్తర ,శతనామాలతో పూజించుకోవడం వలన శని దోషనివారణ జరుగుతుందని భక్తుల నమ్మకం.


                                   
                                               అందమైన ఆలయ దృశ్యం

ప్రత్యేక ఉత్సవాలు:------    ప్రతి శనివారం జరిగే విశేషపూజలే కాకుండా ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి కి ఫ్రత్యేక ఉత్సవం నిర్వహిస్తారు.ప్రతి దసరాకు శమీపూజ,ప్రత్యేక సేవలు ఉంటాయి.ప్రతి వైకుంఠ ఏకాదశి కి ఉత్తర ద్వార దర్శనం,గ్రామోత్సవం నిర్వహిస్తారు. చైత్రఫౌర్ణమి కి స్వామి వారి కళ్యాణం పాంచాహ్నిక దీక్షతో వైఖానసాగమం ప్రకారం నిర్వహిస్తారు.పౌర్ణమి రోజున స్వామి వారి కళ్యాణం, రెండవరోజు రధోత్సవం, మూడవరోజు సప్తర్షుల పూజ, సదశ్యము, నాల్గవరోజు వసంతోత్సము , ఐదవరోజు చోరసంవాదము , పుష్పయాగము  అతి ఘనంగా జరుగుతాయి.ఈ రోజుల్లో వేలాది మంది భక్తులు శ్రీ స్వామి వారిని దర్సిస్తారు
.
                                 
                                                      శ్రీ వారి పాదాలు


                 స్వామివారి సన్నిధిలో నామకరణోత్సవాలు, అన్నప్రాసనలు,ఉపనయనాలు,   వివాహాలు చెవులు కుట్టించుకోవడం వంటి శుభకార్యాలను భక్తులు వేడుకగా  జరుపుకొని మ్రొక్కుబడులు సమర్పించుకుంటారు.ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో రైతులు ఆ యేడాది తాము పండించిన పంటను, పాలు, నెయ్యిని స్వామివారికి అర్పించుకోవడం  ఒక ఆనవాయితీ గా వస్తోంది.

                  చైత్ర శుద్ధ పౌర్ణమి నాటికి  41 రోజులు పూర్తయ్యే విధంగా  వేంకటేశ్వర మాల థారణ చేయడం ఇక్కడొక  సంప్రదాయంగా వస్తోంది.



                                                ఆలయ ముఖద్వారం

రవాణా వసతి సౌకర్యాలు :-------    చిల్లకల్లు, జగ్గయ్యపేట ల నుండి ఆర్టీసీ, ఆటో సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయి. కొండపైకి ప్రస్తుతము కచ్చా రోడ్డు వేయబడింది.చిల్లకల్లు నుండి  3 కి.మీ దూరమే కాబట్టి   ప్రయాణము   భారము కాదు. పరిమిత సంఖ్య లో గదులు వసతి సౌకర్యాలు లభిస్తాయి.  పరిమితంగా నిత్యాన్నదానపథకం కొనసాగుతోంది.


                                                  గరుడాళ్వారు దివ్య దర్శనం

ఆలయము తెఱచి ఉంచు వేళలు :----   ఉ .6 .గం.ల నుండి సా.6.గం.వరకు వివిథ దర్శనాలు  అందుబాటులో ఉంటాయి.  అబిషేకం చేయించుకోదలచిన భక్తులు  ఉదయం 7గం.లకు ముందే ఆలయానికి చేరుకోవాలి.ప్రతిరోజు ఉ.7.గం.లకు స్వామి వారికి అభిషేకం జరుగుతుంది.

 ఇతర వివరాలకు సంప్రదించవలసిన నెంబర్లు.:-----     8654-200288  ,200579
        తిరుమలగిరి క్షేత్ర వైభవము అనుపేరు తో స్థలపురాణం కౌంటరు లో 10రూ/ లభ్యమౌతుంది. స్వామి వారి సేవలు ,  పూజా వివరాలు  స్థలపురాణం లో చూడవచ్చు.

 ***************      శ్రీ వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం       *********************

Wednesday 17 October 2012

పెనుగంచిప్రోలు శ్రీశ్రీశ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం


          

      Penuganchiprolu Sri Lakshmi Tirupatamma Talli Aalayam.  

                   పెనుగంచిప్రోలు శ్రీ శ్రీ శ్రీ  లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం.

           पॆनुगंचिप्रोलु श्री श्री श्री  लक्ष्मी तिरुपतम्मतल्लि आलयम्.

                                    పెనుగంచిప్రోలు ఒకపురాతన నగరము   మున్నానది గా పిలువ బడే మునేటి ఒడ్డున విలసిల్లిన  బృహత్కాంచీపురమే ఈ పెనుగంచిప్రోలు. 11వ శతాబ్దంలో గుడిమెట్ట ను  పాలించిన చాగి వంశీయులకు రెండవరాజథాని గా పేరొందిన నగరమిది . వీరు రెండు శతాబ్దాల కాలం కాకతీయరాజులకు  విథేయులుగా ఉంటూనే  స్వతంత్ర ప్రతిపత్తి గల మాండలిక రాజ్యంగానే కొనసాగినట్లు చరిత్ర చెపుతోంది. ఇచ్చట నూటొక్క దేవాలయాలున్నట్లు అవన్నీ కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోయినట్లు స్ధానికులు చెపుతుంటారు.
                            
                           అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ అంటాడు అల్లసాని పెద్దన. అలాగే ఈ పెనుగంచిప్రోలు లో  ఎక్కడ తవ్వినా శిధిలశిల్పాలు కళాఖండాలే లభిస్తాయి. ఎక్కడ ఇంటికి పునాదులు తీస్తున్నా, ఎక్కడ కొత్త నిర్మాణానికి గోతులు తవ్వుతున్నా  ఏదో ఒక పురాతన అవశేషాలు  బయట పడుతూనే ఉంటాయి. ఒక ప్రదేశానికి అంత మహత్తు  కలగటం ఆ స్థలమహత్యమని  పెద్దలు చెపుతారు .
       అటువంటి పవిత్ర ప్రదేశంలో తిరుపతమ్మ తల్లి పేరంటాలై  కొలువు తీరింది. కొలిచిన భక్తులకు     కొంగుబంగారమై, కోర్కెల తీర్చెడి కల్పవల్లి శ్రీ తిరుపతమ్మ తల్లి.
                                          
                                                           

                                           శ్రీశ్రీశ్రీ తిరుపతమ్మ గోపయ్యలదివ్యమూర్తులు    

స్థలపురాణం:--------  శ్రీ తిరుపతమ్మ తల్లి వృత్తాంతం క్రీ.శ 1695 లో జరిగినట్లు గా చెప్పబడుతోంది.  శ్రీ తిరుపతి  వేంకటేశ్వరుని అనుగ్రహంతో పుట్టిన  బిడ్ఢ కావున ఆమెకు తిరుపతమ్మ అని పేరు పెట్టారు తల్లిదండ్రులు. కృష్ణాజిల్లా అనిగండ్లపాడు  గ్రామానికి చెందిన కొల్లాశివరామయ్య, రంగమాంబ లు ఆదర్శదంపతులు. భగవంతుని యందు అపారభక్తి విశ్వాసములుకలిగి,పేదసాదలను ఆదుకొంటూ కీర్తిప్రతిష్టలు గడించిన కుటుంబం వారిది.ధనధాన్య పశు బంధుమిత్రాదులను కొల్లలుగా ఇచ్చిన ఆ భగవంతుడు ఆ కొల్లా వారి కుటుంబానికి సంతానయోగం లేకుండా చేశాడు.సంతానార్ధులై తిరుమలయాత్ర చేసిన ఆదంపతులకు తిరుమలేశుని అనుగ్రహంతో ఆడశిశువు జన్మించింది. 
                                      శ్రీ తిరుమల వాసుని  దివ్య ఆశీస్సులతో పుట్టిన బిడ్డకు తిరుపతమ్మ అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచు కొనసాగిరి.  ఆ బిడ్డ పుట్టిన  వేళావిశేషమో, ఏమో గాని ఆయింట ధన ధాన్య పశుసంమృధ్ది   ఇబ్బడి ముబ్బడిగా పెరిగి  ఆ యిల్లే కాక ఆ గ్రామమంతయు పాడిపంటలతో కళకళలాడుచుండెను. పూవు పుట్టగనే పరిమళించునన్నట్లు చిన్ననాటినుండియు శ్రీ తిరుపతమ్మ భగవంతుని యందు భక్తి విశ్వాసాలను, పెద్దలయందు వినయవిధేయతలను , బీదలయందు దయాదాక్షిణ్యాలను ప్రదర్శిస్తూ  అందరికి తలలో నాల్క వలే మెలగు చుండెడిది.

                                                          ఆలయ రాజగోపుర దృశ్యం


                                          ఇదే సమయంలో  ప్రక్కనే ఉన్న పెనుగంచిప్రోలు లో  తిరుపతమ్మ  కు తల్లియైన రంగమాంబ గారి అన్నగారి కుటుంబం నివసిస్తుండేది. కాకాని రామయ్య  గారి కుటుంబం  పెనుగంచిప్రోలు  లో కీర్తి  ప్రతిష్ఠలు గల్గిన వ్యవసాయ కుటుంబం . వీరి తమ్ముడు కృష్ణయ్య.  అన్నదమ్ములిద్దరు  బలరామకృష్ణులవలె    ఒకే మాట  ఒకే బాట గా  వ్యవహరించెడి వారు.  రామయ్య గారి భార్య పుత్ర సంతానాన్ని కని కాలం చేయడం , మరికొంతకాలానికి రామయ్య కూడ మరణించడంతో ఆ పసివాని ఆలనా పాలనా కృష్ణయ్య  దంపతుల మీద పడింది. అతని పేరే మల్లయ్య. అన్నయ్య బిడ్డను అల్లారుముద్దుగా   పెంచుకుంటున్న కృష్ణయ్య దంపతులను చూసి ఇరుగు  పొరుగు వారు ఆశ్చర్య పోయేవారు.కొంతకాలానికి కృష్ణయ్య-వెంగమాంబా దంపతులకు మగపిల్లవాడు జన్మించాడు .  అతనికి గోపయ్య  అని   నామకరణం చేశారు. కృష్ణయ్య కు వ్యవసాయ  పనుల్లో సహాయం చేస్తూ  మల్లయ్య ,గోపయ్య లు పెరిగి పెద్ధ వాళ్లు అయ్యారు. యుక్త వయస్కుడైన  మల్లయ్యకు అనిగండ్లపాడుకే చెందిన కన్నేటి వారి ఆడబడుచు      చంద్రమ్మ నిచ్చి వివాహం చేశారు.


       దేవాలయ ఉత్తర ద్వార గోపురము

                        శ్రీ తిరుపతమ్మ ను  గోపయ్యకు ఇచ్చి వివాహం చేయడానికి  పెద్దలు సంప్రదించుకొని తాంబూలాలు పుచ్చుకున్నారు.ముహూర్తసమయానికి అంగరంగవైభవంగా గోపయ్య తిరుపతమ్మల కళ్యాణం జరిగింది.రెండు గ్రామాల్లోను పండుగ వాతావరణం వెల్లివిరిసింది.తిరుపతమ్మ అత్త వారింట  అడుగు పెట్టింది. ఆడపడుచు ను  అత్తవారింటికి పంపిస్తూ  సమస్త గృహోపకరణాలతోపాటు ఒక గోవు ను కూడ అరణం గా పంపించాడు స్ధితిమంతుడైన శివరామయ్య.
            కొత్తకోడలు రాకతో కాకాని వారింటికి కొత్త కళవచ్చింది.  పాడిపంటలు సిరిసంపదలు వృద్ధిచెందాయి. లక్ష్మీదేవి వచ్చిన వేళావిశేషమని నలుగురు చెప్పుకోసాగారు. క్రమక్రమంగా తోడికోడలు చంద్రమ్మ మనసులో  ఈర్ష్యాసూయలు బయలు దేరినాయి. అత్తగారైన  వెంకమ్మ మనసును కూడ మార్చి వేసింది. సూటిపోటిమాటలతో తిరుపతమ్మ ను వేధించసాగినారు.
                    ఈ ఆలయానికి సంబంథించిన వీడియో ను  you tube  ద్వారా చూడవచ్చు.




                      ఇదేసమయంలో ముదిరాజు వంశజురాలైన పాపమ్మ వచ్చి, తిరుపతమ్మతో పరిచయంచేసుకొని, ఆవిడకు అన్ని రకాల చేదోడు వాదోడు గా వుంటుండేది. తీరికసమయాలలో భారత,భాగవత,రామాయణాదులతో సద్గ్రంథ కాలక్షేపం చేస్తుండేవారు.
                        కాలం ఎప్పుడూ ఒకేరీతిగా ఉండదు కదా కృష్ణాజిల్లాలో వర్షాబావ పరిస్ధితులేర్పడ్డాయి. కరువుకాటకాలతో జనం వలసలు వెడుతున్నారు. గొడ్లకు మేతదొరకడం గగనమై పోయింది.   ఆలమంద ను  ఉత్తర ప్రాంత భూముల కు  మేత కోసం తోలుకుపోవడానికి నిర్ణయించుకొని ఊరంతా నిర్ణయించుకొంది.ఇంటికి ఒకరు చొప్పున మంద వెనక వెళ్లాలని తీర్మానం.కృష్ణయ్య  గారి ఇంటి నుండి గోపయ్య బయలుదేరాడు. భర్త వెళ్లడం తిరపతమ్మకు ఇష్టం లేకపోయినా సందర్భం కాదని మాట్లాడకుండా ఉండిపోయింది.           
                   గోపయ్య అడవి వెళ్లినదగ్గరనుండి తిరుపతమ్మ కు అత్త తోడికోడలు పెట్టే ఆరళ్లు కూడ ఎక్కువైనాయి.ఇంతలో తిరుపతమ్మకు కుష్టువ్యాధి సోకటంతో ఆమెను గొడ్లసావిట్లో పడేశారు.ఇన్ని బాధలు పడుతున్నాతిరుపతమ్మ పుట్టింటికి ఒక్కకబురు కూడ చేయలేదు. అన్ని వేళలా పాపమ్మె ఆమెకు చేదోడు వాదోడు గా  ఉండేది. ఇంతలో ఆలమందల వద్ద నున్న గోపయ్యకు తిరుపతమ్మ ను గూర్చి ఏవేవో  చెడు కలలు రాలడంతో ,తన ఆవులను తోటివారి కప్పగించి పెనుగంచిప్రోలు వచ్చేశాడు. ఇంట్లో తిరుపతమ్మ కనపడలేదు. అమ్మ వదినలు  తిరుపతమ్మ పుట్టింటికి వెళ్లిందని అబద్దమాడారు. మునేటి ఒడ్డున అమ్మలక్కల మాటల్లో  తిరుపతమ్మ కొచ్చిన కష్టాన్ని విన్న గోపయ్య పరుగు పరుగన గొడ్లసావిడికి చేరుకొన్నాడు.


                     కుళ్లి కృశించి నీరసించిన శరీరంతో గోశాల లోపడివున్న ఇల్లాలును చూచి  విహ్వలుడై, ఆమెను పట్టుకొని బోరుబోరు న విలపించాడు గోపయ్య. వెంటనే వెళ్లి అలమందను తోలుకొచ్చేసి  ,తిరుపతమ్మ దగ్గరే వుండి   ఆరోగ్యాన్ని చూసుకంటానన్నాడు.    తిరుపతమ్మవద్దంటున్నా వినక మందను తోలుకు రావడానికి అడవికి వెళ్లిపోయాడు గోపయ్య .అక్కడ కు వెళ్లేసరికి పరిస్థితంతా అస్తవ్యస్దంగా ఉంది. తిరుపతమ్మ పుట్టింటినుండి  అరణంగా తెచ్చుకున్నఆవు ను పెద్దపులి  నోట కరుచుకు పోయిందని చెప్పారు తోటిస్నేహితులు. అసలే  బాధలో వున్న గోపయ్య  ఆవేశంతో గండ్రగొడ్డలి పట్టుకొని  పులి గుహలోకి ప్రవేశించాడు. విథివక్రించింది . గోపయ్య నేలకొరిగాడు. ఆవిషయం తన యోగశక్తి తో తెలుసుకున్న తిరుపతమ్మ యోగాగ్ని తో మరణించడానికి సిద్దపడి, గ్రామపెద్దయైన శ్రీశైలపతి గార్కి పాపమ్మ ద్వారా కబురు చేసింది.చర్చోపచర్చల  తరువాత గ్రామపెద్దల అంగీకారం జరిగింది. వెంకమ్మ, చంద్రమ్మలు తమ తప్పు తెలుసు కొని తిరుపతమ్మను శరణువేడారు. పాపమాంబ  వంశము ఆచంద్ర తారార్కము  అభివృధ్ధి చెందుతూ,నిత్యనైవేద్య దీపధూప అర్చనహారతులు  తిరుపతమ్మకు పాపమ్మవంశము వారినుండే లభించేటట్లు   ఆదేశించిన తిరుపతమ్మ పసుపు కుంకుమలతో కూడిన పూజాపళ్లాన్ని పాపమ్మకు అందించింది . పాపమ్మ కడసారిగా కన్నీటితో తిరుపతమ్మకు పాదాభిషేకం చేసింది .   
                                                                                                                                          
                           సాయంసంథ్యావేళలొ , బాజాభజంత్రీలుమారుమ్రోగుతుంటే, దిక్కులు పిక్కటిల్లేలా జనసందోహం జయజయథ్వానాలు చేస్తుంటే తిరుపతమ్మ యోగాగ్ని ప్రవేశం చేసింది.  ఆప్రదేశంలో  తిరుపతమ్మ తల్లి చెప్పిన ప్రకారం మంగళసూత్రము కుంకుమ భరిణె దేదీపేయమానంగా ప్రకాశించే గోపయ్య తిరువతమ్మ ల విగ్రహాలు  లభించాయి. గ్రామపెద్దలైన శ్రీశైలపతి గారు  ఆప్రదేశంలోనే  దివ్యయంత్రాలతో ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించి ఆలయాన్ని నిర్మించారు. తమ్ముడి మరణం మరదలు యోగాగ్ని ప్రవేశంతో దిగులు పడి  మంచం పట్టి మరణించాడు మల్లయ్య.  తన  తప్పులు తెలుసుకున్న  చంద్రమ్మ  పసిపాపతో సహా సతీసహగమనం చేసింది.  శ్రీశైలపతి గార్కి తిరుపతమ్మ కలలో కన్పించి చెప్పడంతో,  చంద్రమ్మ మల్లయ్యలకు కూడ అమ్మవారి ఆలయానికి  దక్షిణంగా గుడి కట్టించారు. ముందుగా చంద్రమ్మ  దంపతులను దర్శించిన తరువాతే అమ్మవారిని దర్శిచాలనేది నియమం. ఆనాటి  నుండి తిరుపతమ్మ పేరంటాలు   భక్తుల పాలిట  కామధేనువై  కోరిన కోరికలను తీరుస్తూ, భక్తులమొక్కులను అందుకుంటూ కాపాడుతోంది.




చారిత్రకత.         పెనుగంచిప్రోలు  చారిత్రక నగరమని ఇంతకు ముందే  ప్రస్తావించాను. 11, 12 శతాబ్దాల్లో  

గుడిమెట్ల రాజ్యాన్నిపరిపాలించిన చాగి పోతరాజు కుమారులు  దోరపరాజు  గణపతిరాజు మనమ గణపతి రాజు వేయించిన శాసనాలు పెనుగంచప్రోలు,  వేదాద్రి ,కొనకంచి నవాబుపేట, ముక్త్యాల, ముప్పాళ్ల, మాగల్లు  జుజ్జూరు మొదలైన ప్రాంతాల్లో లభించాయి. కాకతీయ శిల్పశిథిలాలు ఇప్పటికీ తవ్వకాల్లో బయటపడుతూనే ఉన్నాయి. ఉంటాయి కూడ. మునేటికి వరద వచ్చి తీసేసి నప్పుడల్లా   ఏట్లో  ఏవేవో కట్టడాలు ,నిర్మాణాలు బయటపడటం సాథారణమై పోయింది.
                            

                                                                           శాసనము
                             
                                 ఆనాడు నందిగామ తహశీల్దారుగా  ఉన్న మహమ్మద్ మొయినుద్దీన్ గారు తిరుపతమ్మ మహిమను తెలుసుకొని  , అమ్మ వారిఆలయనిర్మాణనిమిత్తం రెండు ఎకరాలస్థలాన్ని వ్రాసి యిచ్చిన శాసనం ఇప్పటికి ఆలయంలో మనకు కన్పిస్తోంది.


ఆలయ ప్రత్యేకత :------             సంతానార్థులైన దంపతులు మునేట్లో మునిగి, తడిబట్టలతో ఆలయప్రదక్షణం  చేసి, ప్రాణాచారం పడినట్లయితే అమ్మ పసిపాప రూపంలోనో, పెద్దముత్తైదువు రూపంలోనో వచ్చి ఆశీర్వదిస్తుందని భక్తులనమ్మకం. కోరిక తీరిన భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించు కుంటుంటారు.  పెళ్లిజరగటంలో జాప్యం జరుగుతున్నా, కాపురంలో కలతలు రేగినా  వారి తల్లిదండ్రులుగాని  అత్తమామలు గాని వచ్చి అమ్మవారి కళ్యాణం  జరిపించి పసుపు కుంకుమ అక్షతలను స్వీకరిస్తే  కలతలు తీరతాయని విశ్వాసం.

  ఆదిపరాశక్తి అంకమ్మ.:--------                    ఈమె పెనుగంచిప్రోలు గ్రామదేవత.ఈమె కూడ ఈ ఆలయంలోనే కొలువు తీరి ఉంది.కోరికలు నెరవేరిన తరువాత భక్తులు ఈమె కొరకే చిన్నతీర్థం{ కోడి} పెద్దతీర్థం{ మేక} పూజ చేస్తారు. ఈమెను ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు నిమ్మకాయ పూజలు చేస్తారు. అంకమ్మవారి వద్ద నిమ్మకాయ పూజ జరిపిన భక్తులకు నరఘోష పీడానివారణ, వాహనవృద్ది, గృహశాంతి, ధనవృద్ది జరుగుతాయని  ప్రగాఢనమ్మకం.



మద్దిరావమ్మ అమ్మవారు.:--------                ఇదే ఆలయంలో కొలువు తీరిన అమ్మ్మవారు. మంచిరాలపురం మంచిర్యాల  పాలించే రెడ్డిరాజు  మహమ్మదీయులతో జరిగిన యుద్దంలో వీరమరణం పొందాడు. ఆవిషయం తెలిసిన ఆయన ఇల్లాలు మద్దిరావమ్మ  యుద్ధరంగానికి వెళ్ల సేనాపతిని సహాయంతో శత్రురాజులను సంహరించి  విజయం సాథించి,  తన ప్రజలచేత విజయలక్ష్మి  గా మన్ననలనందుకొంది. ఆమె ఈ క్షేత్రానికి వచ్చి  ప్రణవంతో హృదయ స్పందనను నిరోధించి , తిరుపతాంబ ఆశీ: బలంతో ఇక్కడ అమ్మవారై వెలసింది. మద్దిరావమ్మ అమ్మవారి అర్చకస్వాములచే  ధరింపజేయు విజయలక్ష్మీ కంకణం  కోరిన కోర్కెలను తీరుస్తుందని విశ్వాసం. ఇది ఈ ఆలయంలో ప్రత్యేకం.



శ్రీ జ్యేష్టాదేవి అమ్మవారు.:-----        గోపయ్యస్వామి ని  భౌతికంగా కడతేర్చిన పులి   పెద్దమ్మ తిరుపతమ్మ  యోగాగ్ని ప్రవేశం చేసిన మూడోరోజున   ఆ పుణ్యస్థలికి   అనగా ఇపుడు ఆలయం ఉన్నప్రాంతానికి వచ్చి మూడుసార్లు  ప్రదక్షిణం చేసి ప్రక్కనే ఉన్న మఱ్ఱిచెట్టు వద్దకు వెళ్లి  తిరుపతమ్మ తల్లి కి నమస్కరిస్తూ  తుది శ్వాస విడిచింది. దాన్ని సమాథి చేయడానికి  గొయ్యి త్రవ్వగా దానిలో శార్ధూలవాహిని యైన పెద్దమ్మవిగ్రహం లభించింది. అక్కడే విగ్రహాన్ని ప్రతిష్ఠించి గుడి కట్టించారు శ్రీశైలపతిగారు. మనుష్యులను కష్టపెట్టి ,అనేకపరీక్షల నిచ్చి మనిషిలోని శక్తి సామర్థ్యాలను ప్రతిభను బయటపెట్టేదే పెద్దమ్మ అని ప్రజలు నమ్మకం.




                                                      అమ్మవారి  ప్రభోత్సవము జరిగే ప్రభ

                     ప్రత్యేక ఉత్సవాలు.:- తిరుపతమ్మతల్లి  కి ప్రతియేటా  రెండు తిరునాళ్లు జరుగుతాయి. మొదటి తిరునాళ్లు మాఘపౌర్ణమి నాడు ప్రారంభమయి ఐదు రోజులు జరుగుతాయి. మాఘఫౌర్ణమి రోజున నిథి మహోత్సవము. ఆరోజున ఆరుబయట  శ్రీ తిరుపతమ్మ గోపయ్యస్వాముల కళ్యాణం జరుగుతుంది. అదేరోజున అప్పటికి  41 రోజులముందు ఇరు ముళ్లు కట్టించుకున్న  తిరుపతమ్మ మండల దీక్ష తీసుకున్న స్వాములందరు  తిరుపతమ్మ గోపయ్యస్వాముల  కళ్యాణాన్ని దర్శించి తిరుముళ్లు సమర్పిస్తారు. రెండవరోజు జలబిందెల మహోత్సవము  .మూడోరోజు అంకమ్మవారికి అంకసేవ, నాల్గవరోజు పొంగలి నివేదన, అ దేరోజున అర్థరాత్రి 12గంటల తర్వాత ఐదవరోజు  అమ్మవారిదీవెనగా బండారును భక్తులకు పంపిణీ చేస్తారు.
                             రెండవ తిరునాళ్లు  ఫాల్గుణ పౌర్ణమి నాడు ప్రారంభమయి ఐదు రోజులు జరుగు తుంది. దీన్ని  చిన్నతిరునాళ్లు అంటారు.మొదటి రేజు అఖండస్థాపన,రెండోరోజు రథోత్సవము, మూడోరోజు ప్రభోత్సవము, శుక్ర, మంగళ వారాలు కాని రోజులు చూచి నాల్గవరోజు  పుట్టింటి పసుపు కుంకుమను అనిగండ్లపాడు నుండి తెచ్చుమహోత్సవం జరుగుతుంది. ఐదోరోజు బోనాలపండుగ.
                 ఇవిగాక రెండు సంవత్సరాలకొకసారి మేడారం సమ్మక్క సారక్కజాత జరుగు సమయంలోనే          గర్భాలయంలోని అమ్మవారి విగ్రహాలకు సహదేవతా విగ్రహాలకు కృష్ణాజిల్లా జగ్గయ్యపేట తీసుకెళ్లి రంగులు వేయించడాన్ని  రంగులోత్సవమని పిలుస్తున్నారు.పుష్యమాసం కృష్ణపక్షఏకాదశినాడు రంగులోత్సవానికి  బయలుదేరిన అమ్మవారు మాఘశుద్ధ ద్వాదశి నాటిరాత్రికి తిరిగి ఆలయంలోకి ప్రవేశిస్తారు. విగ్రహాలన్నీ దారువుతో చేసినవి అవడం మూలంగా ఈ ఉత్సవం ఏర్పడింది. ప్రతి శుక్రవారం ఉ,.7.30-8.30  అమ్మవారికి అబిషేకం  విశేష కార్యక్రమంగా జరుగుతుంది.ప్రతిరోజు  ఉదయం 10. గం నుండి 12.30 ని.వరకు    శ్రీ తిరుపతమ్మ  గోపయ్య స్వాముల నిత్యకళ్యాణోత్సవం జరుగుతుంది.ప్రతి శ్రీరామ నవమి కి సీతారామకళ్యాణం నిర్వహిస్తారు.   ప్రతి వైకుంఠఏకాదశి కి ్అమ్మవారి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది.

                                                              అమ్మవారి రధము
                 ఆలయము తెఱచి ఉంచు వేళలు.:-------   ఫ్రభాతకాలం లో గం.4.30ని.లకు మేలుకొలుపు తో ఆలయం  తలుపులు తెరుచుకుంటాయి .రాత్రి గం.8 .30 ని.లకు కవాటబందనము.  ఉ.5.30 ని.లకు సర్వదర్శనం ప్రారంభం. మ.3.00 నుండి రా. 8.00 వరకు సర్వదర్సనం కొనసాగుతుంది. మిగిలిన సమయాల్లో  వీలుని బట్టి ప్రత్యేక దర్శనం ఉంటుంది.
రవాణాసౌకర్యాలు.:----- నందిగామ, విజయవాడ, జగ్గయ్యపేట, నుండి ఆర్టీసీ  సర్వీసులు ఉన్నాయి. ప్రత్యేక ఉత్సవాలప్పుడు  రాష్టంలోని ప్రదాన కూడళ్లనుండి ప్రత్యేక సర్వీసులు నడప బడుతున్నాయి.
సంప్రదించవలసిననెంబరు.:------ 08678-283204


*********************************************************************************