Friday 7 February 2014

నాచారంగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం

   
                   
        Nacharamgutta Sri LakshmiNarasimha Swamy Aalayam.

                 नाचारंगुट्टा श्रीलक्ष्मीनरसिंहस्वामि आलयम् .    

                       నాచారం గుట్ట   శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం.
                            
                               మెదక్ జిల్లా లో కొలువు తీరిన మరొక నారసింహక్షేత్రం నాచారం గుట్ట. హైదరాబాద్ నుండి సుమారు 59 కి మీ దూరం లో హరిద్రానదీ తీరం లో  ఈ దివ్యక్షేత్రం అలరారుతోంది. ఇచ్చట శ్రీ  నరసింహ స్వామి  లక్ష్మీదేవి తో కూడి స్వయంభూవ్యక్తుడై కొలువుతీరి ఉన్నాడు.ఈ నాచారం గుట్టనే  నాచగిరి అని, శ్వేతగిరి అని కూడ పిలుస్తారు. గత  ఐదు శతాబ్దాలుగా ఈ నాచగిరి పైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి అభివ్యక్తుడై,  భక్తులచే పూజలందుకుంటూ, వారిని అనుగ్రహిస్తున్నట్లు స్థలపురాణం చెపుతోంది.

                                             తోరణద్వారం

            స్థలపురాణం .--    కృతయుగం లో దుష్టశిక్షణ కై ఆవిర్భవించిన శ్రీ నారసింహుని ప్రాదుర్భావ సమయ సంజనిత గర్జారావం భూనభోంతరాళాల్లో దద్దరిల్లి , చతుర్దశభువనాల్లోను మార్మోగింది. ఆ సమయం లో నవనాథులు  ఈ నాచగిరి క్షేత్రం లోని  ఎత్తైన కొండలలోని గుహలనుండి వెలువడుతున్న  నారసింహ గర్జనలను విని ఇది పరమ పవిత్ర ప్రదేశం గా భావించి ఇచ్చటనే తపస్సు కు  ఉపక్రమించారు. ఆదిశేషుని రూపం లో ఉన్న గుహ లో శ్రీ స్వామి అర్చారూపుడుగా , స్వయంవ్యక్తుడై దర్శనమివ్వడం తో సంతోషించారు.
                            

                        
                                     ఆలయ ప్రధాన ప్రవేశద్వారం
                        శ్రీ స్వామి వారి అనుగ్రహం తో  హరిద్రానది పసుపు ,కుంకుమ వర్ణాలు గల సాగు భూముల గుండా నీలవర్ణపు  నీటిని  వెదజల్లుచూ ఆవిర్భవించి, స్వామి పాదాలచెంత ఉత్తరవాహినియై ప్రవహిస్తూ,  భక్తజనుల కల్మషహారిణి యై  ప్రసిద్ధి కెక్కింది.
             


            
                                    ఆలయ రాజగోపురం
                                   గార్గేయ మహర్షి ఈ ప్రదేశం లో తపస్సు చేయడం వలన ఈ ప్రాంతాన్ని గార్గేయ తపోవనం గా కూడ పిలుస్తారు.
               

                  
                                               ఆలయ ఉత్తర ద్వారం       

                   పైన చెప్పిన వృత్తాంతం లో నవనాథుల ప్రస్తావన వచ్చింది కాని వారిని గూర్చిన వివరణ వేరొక గాథ లో లభిస్తోంది.
         

   
           మరొక గాథ ననుసరించి --       కలియుగం ప్రారంభమై క్రీ.శ 2014 నాటికి 5114 సంవత్సరాలైనట్లు చెప్పబడుతోంది.  కలియుగ ప్రారంభం తో అధర్మం పెచ్చుపెరిగి , పాపం తాండవించసాగింది. పాపభారాన్ని భరించలేని భూమాత విష్ణుమూర్తికి మొర పెట్టుకుంది. ఆ సర్వాంతర్యామికి తెలియనిదేముంది ?.


            
                                  గర్భగుడి వెలుపలి వైపు   దర్శనమిచ్చే దాసాంజనేయుడు
               
                               అందుకే ఈ ఉపద్రవాన్ని కొంతవరకన్నా అరికట్టడానికి శ్రీమహావిష్ణువు తొమ్మండుగురిని పిలిచాడు. వారే నవనాథులు. హరి,అంతరిక్షుడు, ప్రబుద్దుడు, పిప్పలాదుడు ,అవిర్హేతుడు ,ద్రుమిళుడు , చ్యవనుడు , కరభాజుడు ,కలి , అనే వారు నవనాథులు. శ్రీమహావిష్ణువు వారిని పిలిచి కలియుగం లో రాబోయే ఉపద్రవాలను యథాశక్తి నిరోధింపుడని ఆజ్ఞాపించాడు. వారు భూలోకానికి చేరుకొని, హరిద్రానదీ తీరానికి వచ్చారు. ఈ శ్వేతగిరి చెంతకు వచ్చే సరికి , ఇచ్చటి గుహలో నుండి సింహగర్జనలు వినిపించాయి.

                                  శ్రీ  లక్ష్మీ నరసింహస్వామి  దివ్యదర్శనం   


                   ఆ గర్జనలు వారిలో సంతోషాన్ని ఉప్పొంగ చేశాయి. ఇంకేముంది. వెంటనే అష్టాక్షరి ని జపిస్తూ, మనసంతా శ్రీహరి మయం కాగా అక్కడే తపస్సు ప్రారంభించారు నవనాథులు. వారి తపస్సుకు మెచ్చి, యుగాలనుండి అక్కడే ఉంటున్నా, వీరికి దర్శనమిచ్చాడు స్వామి.

                 ఈ ఆలయ దృశ్యాలను you tube  లో  కూడ దర్శించవచ్చు.
                       శ్రీ స్వామిని దర్శించిన  ఆ మహనీయులు అమ్మవారి తో కూడ శ్రీ స్వామి దర్శనం కావాలని కోరుకున్నారు. నవనాథుల కోరికను మన్నించారు శ్రీ నరసింహస్వామి. శ్రీ లక్ష్మీనరసింహుడై వారికి దర్శనమిచ్చారు స్వామి.
                              


                         శ్రీ స్వామి వారి దివ్యరూపం
                              ఆ కొండ మీదనే అదే రూపుతో కొలువై భక్తులను అనుగ్రహించ వలసిందిగా  మహర్షులు వేడుకున్నారు. భక్తపరాధీనుడైన లక్ష్మీనాథుడు వారికోరికను మన్నించాడు. శ్రీ లక్ష్మీనరసింహుడై నాచగిర పైన కొలువు తీరి ,  కొలిచిన వారికి కొంగుబంగారమై, ఆర్తుల నాదుకంటూ, భక్తజనమందారుడై మొక్కుల నందుకుంటున్నాడు.

                                 

                
                                                  ధ్వజస్థంభము
                              
                    కొంతకాలానికి నాచారమనే భక్తుడు, స్వామి సేవలో తరించి ,ఆయన లో ఐక్యమయ్యాడు. ఆ భక్తుని పేరనే ఈ శ్వేతగిరి పిలవబడుతుందని భగవానుని ఆజ్ఞ. అందువల్లనే ఆ గిరి నాచారం గుట్ట గాను,  ఆ గిరి క్రింద ఏర్పడిన గ్రామాన్ని నాచారం గాను పిలుస్తున్నారట.
           

                            
                                              శ్రీ సీతారామచంద్రస్వామి ఉపాలయం
                    ఇక్కడ  ఉన్న ఉపాలయాలలో శ్రీ సీతారామచంద్రస్వామి , శ్రీ సత్యనారాయణ స్వామి. ఆంజనేయుడు, సూర్యభగవానుడు , దత్తాత్రేయుడు , నవగ్రహాలను కూడ దర్శించవచ్చు.
           

                      ఆలయప్రధాన ప్రవేశ ద్వారానికి ఎదురుగా శ్రీ ఆంజనేయ మందిరం , శ్రీ షిర్డీ సాయిబాబా గుడి  ప్రత్యేకంగా భక్తులను ఆకర్షిస్తాయి.

                                                  ఆంజనేయ ఆలయ తోరణద్వారం


********************************************************************************** 

Saturday 1 February 2014

బొంతపల్లి శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం

           

  Bontapalli Sri Bhadrakali sameta VeerabhadraSwamy Aalayam.


 बॊंतपल्लि श्री भद्रकाळी समेत वीरभद्रस्वामि आलयम्.


                            బొంతపల్లి   శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం
                

                         మెదక్ జిల్లా  జిన్నారం మండలం లోని బొంతపల్లి లో శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి కొలువు తీరి ఉన్నాడు   హైదరాబాద్ నుండి 40 కి.మీ దూరం లోను, మెదక్ నుండి 68 కి.మీ దూరం లోను ఈ క్షేత్రం అలరారుతోంది. ఆధునిక కాలం లో  ఈ ఆలయానికి  సాధారణ భక్తులు విరివిగా వస్తున్నప్పటికీ  తొలినాళ్ల  లో మాత్రం వీరశైవులు, లింగథారులు, అనంతరం ఆర్య వైశ్యులు  ఈ వీరభద్రుని పరదైవతంగా కొలిచి,తరించినట్లు, వారి పాలిట ఈ క్షేత్రం  పుణ్య ధామం గా విలసిల్లినట్లు  తెలుస్తోంది. ఆలయ ప్రధానద్వారం ముందు దర్శనమిచ్చే నిప్పులగుండం ఇక్కడ జరిగే వీరాచార సాంప్రదాయానికి ప్రతీక గా కన్పిస్తోంది.
              
                                          దీపపు కాంతి లో తోరణద్వారం
                                             
                      స్థలపురాణం :-                                   పూర్వకాలం లో ఈ ఆలయం  చాల చిన్నది గా ఉండేదట. ఒక రాత్రి సమయం లో ఓ గొఱ్ఱెలకాపరి గొంగళి భుజాన సర్దుకుంటూ  ఆలయం ముందు నుంచి వెడుతున్నాడు. ఇంతలో ఎవరో తనను పిలిచినట్లు అనిపించింది. వెనక్కి తిరిగి చూశాడు గొఱ్ఱెల కాపరి. ఎదురుగా వీరభద్రస్వామి దివ్యమూర్తి. భయపడిపోయాడు కాపరి. నెమ్మదిగా పల్కరించాడు స్వామి. అతని లోని భయాన్ని పోగొట్టాడు.  మాటల్లోకి దించాడు. నాకు ఇక్కడ నచ్చలేదు. వేరేచోటుకు వెళ్ళాలనుకుంటున్నాను .కాబట్టి నన్ను    నీ భుజాలమీద ఎక్కించుకొని నువ్వు అలసిపోయినంతదూరం తీసుకెళ్లి అక్కడ దించమని అడిగాడట వీరభద్రుడు.. అది ఆ కాపరి చేసుకున్న పుణ్యఫలం అనుకోవాలి.


                                                                  ఆలయ రాజ గోపురం                     
                       
                    ఆ గొఱ్ఱెల కాపరి   వీరభద్రస్వామి చెప్పినట్లే స్వామిని భుజాలమీద ఎక్కించుకొని కొన్ని మైళ్లు నడిచి ఇప్పుడు ఆలయమున్నప్రదేశానికి వచ్చేసరికి అలసిపోయి వీరభద్రుని క్రిందకు దించాడు.  ఆ విధంగా ఆ కాపరిని అనుగ్రహించారు వీరభద్రస్వామి.  

                                 తనను భూమి మీదకు దించి, సొక్కుతీర్చుకుంటున్న కాపరి తో వీరభద్రస్వామి  ఇక నీవు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్లు.  వెనక్కి తిరిగితే  శిల గా మారిపోతావని చెప్పాడు.( కోటప్పకొండ స్థలపురాణం లో  ఆనందవల్లి (గొల్లభామ ) వృత్తాంతం లో కూడ ఇదే మాట అన్నాడు  ఈశ్వరుడు). పురాణాలలో ముఖ్యం గా స్థల పురాణాలలో ఇటువంటి గాథలు కోకొల్లలు గా విన్పిస్తాయి.             
                                           
                                                 ఆలయం ఎదురు గా శంకరుడు
                 
                                   లోతుగా ఆలోచిస్తే ఇక్కడొక చిద్రహస్యం దాగి ఉందని పిస్తుంది. ఎందుకంటే  ఆ  ఈశ్వరుని సుందర మనోహరము , పరమాద్భుతమైన రూపాన్ని చూసిన తర్వాత ఇక ఐహిక వాంఛల మీద మక్కువ ఉండదు. ఇంకొక రూపాన్ని చూడాలనే ఆతృత ఉండదు. ఒక్కమాట లో చెప్పాలంటే ఆ  స్వామి దివ్యరూపాన్ని దర్శించిన తరువాత మరొక ఆలోచనే ఉండదు. ఆ స్థితి లో  మహనీయుల సంగతి వేరు గాని సామాన్యుడు మాత్రం సామాన్యం గా మనజాలడు. మతిభ్రమణం తో  పిచ్చివాడన్నా అయిపోతాడు. మ్రాన్పడి పోయి స్థాణువు గా ( శిల )నన్నా  మారిపోతాడు.

                     నిండుసభలో శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని దర్శించిన జాత్యంథుడైన ధృతరాష్ట్రుడు భగవానుని దివ్యదర్శనానంతరం  తిరిగి అంథత్వాన్నే కోరుకున్నాడంటే కనులతో త్రాగి మది లో నింపుకున్న ఆ రూపాన్ని ఎంత భద్రంగా పదిల పరుచు కోవాలని ఆయన కోరుకున్నాడో   అర్ధం చేసుకోవచ్చు.  యోగులు, మహర్షులు,   సంయమీంద్రులు మాత్రమే ఆ  మహాద్భుత రూపాన్ని దర్శించి . మనసులో బంధించి,  పున : పున : దర్శిస్తూ అమందానందసందోహ కందళిత స్వాంతులై, అనిర్వచనీయానంద సాగరం లో తేలియాడగలరు.  అందుకే భీష్మ పితామహుడు  చిన్మయరూపుడు శ్రీకృష్ణుని  విశ్వరూపాన్ని దర్శించి,  సేవించి, తలంచి, వేచి తరించాడు.

శ్రీ వీరభద్రుని  దివ్యదర్శనం
                                 
తన కన్నయ్య నోటిలో సమస్త విశ్వంభరా వలయాన్ని సందర్శించిన యశోదామాత స్పృహ కోల్పోయింది. కలయో ! వైష్ణవ మాయయో ! ఇతర సంకల్పార్ధమో !  సత్యమో ? ఎరుగన్నేరక ఉన్న దానను నే యశోదాదేవి కానో  ?” అనే విచికిత్స కు లోనైంది. అనంతరం విష్ణుమాయ తో అంతా సర్దుకుపోయింది. కురుక్షేత్ర రణక్షేత్రం  లో  శ్రీకృష్ణుని విశ్వరూప సందర్శనం  చేసిన అర్జునుని మన: స్థితి ఎలా ఉందో భగవద్గీత  మనకు చెపుతుంది.. మహాయోగి పుంగవుడు, గురువులకే గురువైన శ్రీ రామకృష్ణ పరమహంస ప్రతిరోజు కాళీమాత ను దర్శిస్తూ ఆవిడ తో సంభాషిస్తూ, ఆ ధ్యాస లోనే,  ఆ ధ్యానం లో ఉండిపోయేవాడు. ఆయనను పిచ్చివాడని  ఆనాటి జనం పిలిచేవారట.

                              ఆలయదృశ్యాలను you tube  లో కూడ చూడవచ్చు.

                   ఉపాసనలు, అనుష్ఠానాలు అంటూ హరిద్వార్, హృషీకేశ్ వెళ్లిన కొంతమంది తమలో సంభవించే తరంగ సంచలనాలను, తట్టుకోలేక కవులు గా మిగిలిపోయిన వారు,  మతిభ్రష్టులైన వారు  ఉన్నారని చెపుతుంటారు..

                                         శాస్త్రేషు హీనాశ్చ కవయో భవంతి
                                          కవిత్వ హీనాశ్చ పురాణభట్టా :
                                          పురాణ హీనాశ్చ కృషీవలా స్యు :
                                            భ్రష్టారథా  భాగవతా భవన్తి

                             అనేది ప్రాచీనోక్తి. పురాణేతిహాసాల్లోకి చూస్తే ఇటువంటి గాథలు మనకు కొల్లలు గా కనిపిస్తాయి. ఆ భగవానుని దివ్యసుందర విగ్రహాన్ని  దర్శించిన   కన్ను లతో   మరల ఈ   లోకాన్ని చూడటానికి ఇష్టపడక పోవడమే అన్నింటికీ మూలకారణం.

                                   ఆలయ పురోభాగ దృశ్యం        

                             శ్రీ వీరభద్రుని ఆజ్ఞానుసారం తన ఇంటికి బయలుదేరిన  గొఱ్ఱెలకాపరి  కొంతదూరం వెళ్ళి మానవ సంబంధమైన లక్షణం తో ఉత్సుకత ను ఆపుకోలేక వెనక్కి తిరిగి చూశాడు.  వెంటనే శిల గా మారిపోయాడట.

                                                                     ఆలయ ప్రదక్షిణమార్గం

                    అనంతరం శ్రీ వీరభద్ర స్వామి  ఒక అర్చకునకు కలలో కన్పించాడు. ఆయన గ్రామపెద్దలకు ఆ విషయాన్ని విన్నవించాడు. పెద్దలు పూనుకున్నారు. బొంతపల్లి లో వీరభద్ర స్వామి కి అందమైన ఆలయ నిర్మాణం జరిగింది. అనంతరం శ్రీ స్వామి వారి ఆలయానికి వెనుకభాగం లో భద్రకాళీమాత ఆలయనిర్మాణం చేశారు . శ్రీ స్వామివారి ఆలయం ఇరవైనాలుగుస్థంభాలు గల ముఖమండపం తో  విశాలం గా  నిర్మించబడింది.  ఈ ఆలయం కాకతీయుల కాలం లో నిర్మించబడిందని జనశృతి. కాని అందుకు సాక్ష్యం గాఎటువంటి శాసనాద్యాధారాలు లభించడం లేదు.

                                                             ఆలయవిమాన దర్శనం

                  ఇంకొక గాథ ననుసరించి శివాగ్రహం జటలు విదిలించింది.  వీరభద్రుని ప్రాదుర్భావం , దక్షయజ్ఞ విధ్వంసం పూర్తయ్యింది. ఆ సమయం లో  ఆ దక్ష ప్రజాపతి అనుచరులు  ప్రాణాలు అఱచేత  పెట్టుకొని ,భయం తో పారిపోయి వచ్చి, భూలోకం లోని దండకారణ్యప్రాంతంలో మంజీర, ముచికుంద (మూసీనది )  నదుల  మధ్యభాగం లోకి వచ్చి స్థిరపడ్డారు. ఆ విధం గా స్థిరపడిన వారు అక్కడ స్థానికం గా ఉన్న శివభక్తులను హింసించ సాగారు . వారి ఆక్రందనలను విని వారిని రక్షించడానికి  మరల  అక్కడకు  చేరుకున్నాడు  వీరభద్రుడు.  దుష్టశిక్షణ పూర్తయ్యింది.   అనంతరం  బొంతవలే దట్టంగా పెరిగిన బిల్వవృక్ష సమూహాలతో శోభాయమానం గా ఉన్న ఆ ప్రదేశం తనకు నచ్చడం మూలంగా అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకున్నాడట వీరభద్రుడు . కాకతీయుల కాలం నాటికే ఈ ఆలయం     ప్రసిధ్ది లో ఉన్నట్లు తెలుస్తోంది .  ఈ స్వామిని అగస్త్యుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి.

                                             ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం
      
                                ఉత్సవాలు :-       ఫాల్గుణ  శుద్ధ దశమి నాడు  భద్రకాళీ వీరభద్రుల కళ్యాణోత్సవం అంగరంగవైభవం గా నిర్వహిస్తారు. మరునాడు రధోత్సవం కనులపండువు గా జరుగుతుంది. వేలాదిమంది భక్తులు ఈ ఉత్సవం లో పాల్గొంటారు. శ్రావణ మాసం లో ప్రతిరోజు శ్రీ స్వామివారి కి  లక్షబిల్వార్చన చేస్తారు.     

                                         


      









                                                           శ్రీ వారి రథం
శ్రీ స్వామి వారి కళ్యాణ మండపం                                                 

                                           

                                           బొంతపల్లి   లో అనేక పరిశ్రమలు   నెలకొల్పబడ్డాయి. ప్రతి ఆదివారం  ఇక్కడ జరిగే సంత  ఒక ప్రత్యేక ఆకర్షణ .





                                                             
***************************************************** ****************************